8, అక్టోబర్ 2020, గురువారం

ఆరోగ్య ఆహారం ఏమి?

ఆనందంగా ఉండాలన్నా, ఆత్మ విశ్వాసంతో జీవించాలన్నా, అనుకున్నది సాధించాలన్నా, సాధించింది నిలబెట్టుకోవాలన్నా ఆరోగ్యంగా ఉండాల్సిందే.

జీవించడం కోసం తిను తినడానికే జీవించకు అన్నది నానుడి, ఆధునికత వైపునకు పరుగులు తీస్తున్న మనిషి అంతకన్నా వేగంగా అనారోగ్యాన్ని కూడా కొని తెచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా ఒకప్పుడు అరుదుగా వచ్చే గుండె జబ్బు, క్యాన్సర్, మధుమేహ వ్యాధులు నేడు చాలా సర్వసాధారణమైపోయాయి. సరైన సమయంలో సమతుల ఆహారాన్ని తీసుకోకపోవడమే ఇందుకు పూర్తి కారణము.

మారిన, మారుతున్న జీవనశైలి మనిషిని ఒకచోట నిలవనీయని సమయాభావంలాంటివన్నీ ఆహార విషయంలో మనిషిని అశ్రద్ధకు లోను చేస్తాయి. అందుకు ఫలితమే అనేక రోగాల ఆవిర్భావం.

ముఖ్యంగా మృత్యువుకు కారణమవుతోన్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో 30% మంది ఆహార లోపం వల్లే ఆ వ్యాధికి గురవుతున్నారని తేలింది. గుండెజబ్బు, స్థూలకాయం, రక్తపోటు లాంటి ఇతర వ్యాధులు కూడా జీవనశైలి, తీసుకునే ఆహారంకారణంగానే తలెత్తుతున్నాయి.

జీవన వేగాన్ని అందుకోవడానికి రెడీమేడ్ ఆహారాన్ని ఆశ్రయిస్తున్న గృహాలు ఎన్నో ఉన్నాయి. డైటింగ్ పేరుతో సన్నబడుతున్న యువతీ యువకులు కాలేజీ క్యాంపస్ లలో కనిపిస్తారు. కడుపు నకనకలాడుతున్నా భోజనం చేసే తీరిక లేదంటూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ల మీద దాడి చేసి చిప్స్, బర్గర్ లాంటి చిరుతిల్లనూ, నిరర్థక పానీయాల్నీ ఆశ్రయించేవారి సంఖ్య పెరిగిపోతుంది.

ఈ పరిస్తితుల్ని ఆసరా చేసుకుని వ్యాపార సంస్థలు తెలివిగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఆర్గానిక్ లేబుళ్ళతో రకరకాల బ్రేక్ ఫాస్ట్ సిరియల్ అండ్ పాస్తా లు సూపర్ మార్కెట్ లలో కొలువుదీరుతున్నాయి. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రకృతి సిద్ధమైంది. ఆర్గానిక్ లాంటి పదాలతో కూడిన లేబుల్ విషయంలో జాగ్రత్త వహించాలి.

నవనాగరికత జీవితంలో వేగం, పెద్దల నిర్లక్ష్యం, ఇతర విషయాల ప్రాముఖ్యాన్ని పౌష్టికాహారానికి ఇవ్వకపోవడం, వాణిజ్యప్రకటనల నిరర్థక ఆహార పదార్థాల వాదకం పెరిగిపోయింది.

పోషక ఆరోగ్యం
పిజ్జాలు, బర్గర్లు తినొద్దు, కొవ్వు తినొద్దు. ఐస్ క్రీం లు తినొద్దు, కూల్ డ్రింక్ లు తాగొద్దు, పోషకాహారం గురించి ఎవరు మాట్లాడటం మొదలెట్టినా ఇలాగే మొదలవుతుంది కధ. కానీ ఇది పూర్తిగా సరైన ధోరణి కాదు. పిజ్జాలు, బర్గర్లు తినకూడని విషపదార్థాలేమీ కాదు. కాకపోతే వాటిని సమతుల్యం తప్పి తింటేనే ముప్పు. ఎపుడన్నా ఒకసారి తింటే సమస్యేమీ ఉండదు. అందుకే నేడు ఆహారాన్ని ఎంచుకోవడం అనేది మన తెలివికి, అవగాహనకు ఒక పరీక్షలా తయారైంది. మీ దినచర్యను చక్కటి అల్పాహారంతో మొదలుపెట్టండి. దీనిలో ఇడ్లీ దోస వంటి వాటితో పాటు పళ్ళు, పాలు వంటివీ ఉండేలా చూసుకోండి. ఆహారంలో ముడి బియ్యం, పప్పు దినుసులు, సీజన్ వారీ వచ్చే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, సమృద్ధిగా ఉండేలా చూసుకోండి. పసుపు, అల్లం, వెల్లుల్లి, కుంకుమ పువ్వు లాంటి పదార్థాలకన్నా కొద్దిగా ఉడికించిన పదార్థాలయితే మంచిది. స్వీట్లు ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా తినవద్దు. పచ్చి కూరగాయల్ని, మొలకల్నీ ఆహారంలో భాగంగా చేసుకోండి. చాలా రకాల సమస్యలకు పోషకాహారం తీసుకోకపోతే, లేదంటే సరైన పోషకాలు లేని పదార్థాలు ఎక్కువగా తీసుకోవటమే మూలం… కాబట్టి ఈ పోషక ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటే మనం సగం సమస్యలను అధిగమించినట్లే.

ఒత్తిడి ఆరోగ్యం మితంగానే మంచిది
ఒత్తిడి నిజానికి మనకు మేలు చేసే అంశమే.కాకపోతే అది మితిమీరకుండా చూసుకుంటేనే మంచిది. ఒత్తిడి తగు మోతాదులో ఉంటే లక్ష్య సాధన, పోటీ తత్వం, ఉత్పాదకత వంటివన్నీ అద్భుతంగా పెరుగుతాయి. చురుకుగా ఆలోచించే శక్తి ఒత్తిడి నుంచి కూడా వస్తుంది. కాని ఇది శృతిమించితే మాత్రం నాడీ వ్యవస్థ లయ తప్పుతుంది. మన వ్యవస్థ నియంత్రణలో లేకుండా ఆహారాన్ని తెలియకుండానే గబగబా తినేస్తాము. బరువు పెరిగిపోతాము. అనారోగ్యానికి గురవుతాము. కనుక ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే కండరాలను విశ్రాంతిగా వదిలేయటాన్ని సాధన చేయాలి. కొద్ది నిమిషాల సేపు నెమ్మదిగా చాతీనిండా శ్వాస తీసుకోవటం, వదలటం చేయాలి, ఇలా 20-30 సార్లు చేస్తే ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది.


మీరెంత ఆరోగ్యవంతులో మీ నాడి చూడక్కర్లేదు. మీ పళ్ళెం చూస్తే తెలుస్తుంది. ఆరోగ్య స్పృహలో భోజనం చేసే ఆహారము దివ్య ఔషదంలా పనిచేస్తుంది. అతిగానో, ఆబగానో తింటే అదే విషమై కాటేస్తుంది. మనల్ని ఇబ్బందుల పాలు చేసే రకరకాల వ్యాధులకు మనం తినే తిండి ప్రధాన కారణం. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆహారంతో ముడిపడి ఉంటాయి.

చొక్కా నచ్చక పోతే పక్కన పడేసి మరొకటి కొంటాం, బైక్ నచ్చకపోతే ఏదో ఓ ధరకు అమ్మేసి, కొత్త బండి తీసుకుంటాం.ఇల్లు నచ్చకపోతే మరో ఇంటికి మారిపోతాం. కానీ శరీరాన్ని మార్చుకునే అవకాసం లేదు. ఉన్నంత కాలం, బతికున్నంతకాలం అందులోనే నివాసం ఉండాలి. ఎంత నివాసయోగ్యంగా పెట్టుకుంటామన్నది మన విచక్షణ మీద ఆధారపడి ఉండి.

శరీర జాగ్రత్త
ఆరోగ్యం జాగ్రత్త
జీవన శైలి జాగ్రత్త

కూర్చుంటే ప్రాణాలకు ముప్పే
కూర్చుని పనిచేస్తాం, టీవీ చూస్తాం, ఫోన్లో కబుర్లు చెబుతాం..ఇలా నిలబడకుండా రోజుకు ఎన్నో గంటలు కూర్చునే గడిపేస్తాం. అయితే ఏమిటి అనేయకండి. అలాంటివారికి ప్రాణాలు తీసే రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం 45% ఎక్కువేనని తాజా సర్వేలు చెబుతున్నాయి.

ఇలా చేయడం మంచిది
రోజూ ఉదయం నడక, వ్యాయామం చేస్తున్నా ఆఫీసులో అప్పుడప్పుడూ వీలైనపుడల్లా లేచి అటు ఇటు నడవాలి.
లిఫ్ట్ ఉన్నా వీలైనంత వరకు మెట్లెక్కడం మంచిది.
ఊబకాయం
మన బరువు మనకు శత్రువు. బరువు పెరిగేకొద్దీ మనల్ని వెన్నాడుతుండే జబ్బుల జాబితా కూడా పెరుగుతుందన్నది జగమెరిగిన సత్యం. భారతీయుల్లో 30-50% అధిక బరువుతో బాధపడుతున్నారు.

ఒకప్పుడు మన దేశంలో పోషకాహారలోపమన్నది పెద్ద సమస్య కానీ ఇప్పుడు ఆహార లభ్యత పెరిగింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. వీటికి శారీరక శ్రమలేని జీవనశలి కూడా తోడవడంతో అవసరానికి మించి తినడంతో అధిక పోషణ పెను సమస్యగా తయారవుతుంది.


తినే ఆహారంలో అధికంగా పాలిష్ పట్టిన తెల్లటి బియ్యం, బాగా శుద్ధి చేసిన రిఫైండ్ గోధుమపిండి వంటివి వాడకం పెరిగిపోతుంది. వీటన్నిటి ఫలితంగానే నేడు మనం మధుమేహం, ఊబకాయం, హై బిపి వంటి జబ్బులన్నీ చుట్టుముడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన అంశం మన ఆహారంలో పోషకాలతో నిండిన ముడి ధాన్యాల వంటివి లేకపోవటం జబ్బులను నివారించుకోవాలన్నా, చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలన్నా మనం తినే ఆహారం మీద శ్రద్ధ పెట్టడం మరీ ముఖ్యంగా చిరుధాన్యాల వైపు మళ్ళటం తప్పనిసరి.

చిరుధాన్యాలన్నవి చిన్నగా, మన కంటికి తేలికగానే కనిపించొచ్చు కాని వాస్తవానికి రుచి విషయంలో, ఆరోగ్యం విషయంలో మహాదొడ్డ ధాన్యాలు. చిరుధాన్యాలతో చిరంజీవులుగా ఉండొచ్చు.

సంప్రదాయ ఆహారపదార్థాలను వినియోగంలోకి తీసుకొస్తే ఆధునిక కాలంలో ఆరోగ్య ముప్పును జయించవచ్చు.

చిరుధాన్యాలు నేటికాలానికి నిజమైన మందులు
చిరుధాన్యాల్లో పొట్టు, త్వరగా జీర్ణంకాని పిండి పదార్థాలుండటం వల్ల రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా చేరుతుంది. ఇది మధుమేహులకు ఎంతో మంచిది.
కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తాయి.
నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి త్వరగా ఆకలి వేయదు, త్వరగా బరువు పెరగరు, బరువున్న వారు తగ్గటానికి దోహదం చేస్తాయి.
మరో ముఖ్య విషయం చిరుధాన్యాలన్నీ రకరకాల రంగుల్లో ఉంటాయి. జొన్నలు పసుపుగా, రాగులు ఎర్రగా, కొర్రలు కాస్త పచ్చగా, సామలు తెల్లగా, సజ్జలు, కొన్ని సామలు నీలి రంగులో ఉంటాయి. వీటిలో ఉండే ఆయా ఫైటో కెమికల్స్ ఆయా రంగులను తెచ్చిపెడతాయి. వీటి నుండి యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి.
రక్తహీనతను తగ్గిస్తాయి
ప్రత్యేక లాభం
సాధారణంగా చిరుధాన్యాల పంటకు చీడపీడలు పట్టవు. వీటికి పురుగు మందులు పెద్దగా వాడరు. చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే క్రిమిసంహారక అవశేషాల నుంచి కాపాడుకున్నట్లు అవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి