3, అక్టోబర్ 2020, శనివారం

భవిషత్తు బాట

చీమ నుంచి ఏనుగు దాకా సృష్టిలో ప్రాణులెన్నో నిత్యజీవితంలో పెను సమస్యలు ఎదుర్కొంటాయి. వాటికి సౌకర్యాలు, సౌలభ్యాలు తెలియవు. జీవితాంతం తిండి సంపాదించుకొంటూ బతకడం నరక సదృశమే.

వాన నీటికి కొట్టుకుపోయే బలహీన దేహం పిపీలికానిదైతే- ఎండ, వాన, చలి నుంచి తమ దేహాలను రక్షించుకోలేని అశక్తత భారీప్రాణులది. అవి తమకు నెలవైన అడవిలో ఉంటే వాటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు కొదవుండదు. అడవి వాటి సామ్రాజ్యం. మనిషి అడవులను తన అవసరాల కోసం ఆక్రమించి వ్యవసాయానికి, నివాసానికి అనువుగా మలచుకోవడం మొదలు పెట్టిన దగ్గర నుంచి, ప్రాణుల జీవితం దినదిన గండమైంది. కష్టాలు, బాధలు, భయాలు వాటికీ ఉన్నాయి. గట్టెక్కే విధానమే తెలియదు. తమ తలరాత ఇంతే అని సరిపెట్టుకునే ఇంగితజ్ఞానం ఉండదు. వాటి దయనీయ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకుంటే- మానవ జన్మ ఎంత గొప్పదో అనుభవంలోకి వస్తుంది.

మన ఈతి బాధల్ని మరొకరితో చెప్పుకొని, వారి మాటలతో సాంత్వన పొందుతాం. మన అవసరాలను తెలియజేసి, తగిన వనరులను సమకూర్చుకుంటాం. ఇప్పటికే ఉన్న వ్యాధులకు మందులేసుకుంటాం. కొత్తరోగాలకు నివారణలు కనుక్కొంటాం. ప్రాజెక్టులు కట్టి, నీళ్లు నిలవ చేసుకుని భూమిపై పచ్చని పంటల తివాచీ పరుస్తాం. ఇతర గ్రహాలను నివాస యోగ్యాలుగా చేసుకునే అవకాశాలను పరిశీలిస్తాం, పరిశోధిస్తాం.

కష్టాన్ని ఎదుర్కొనే మనోబలం, నష్టాన్ని పూడ్చుకొనే చాకచక్యం మనకు ఉన్నాయి. ప్రకృతి విపత్తులను అంచనావేసే మేధ ఉంది. ఊహించని వైపరీత్యాలకు గురైనా, సంఘటితంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. సహాయం చేసే గుణం, ఆదుకునే హృదయ వైశాల్యం ఉన్నాయి. ఇన్ని ఉన్నా, ఇంత అద్భుతమైన మానవజీవితాన్ని అదృష్టవశాత్తు సొంతం చేసుకున్నా, ఇంకా ఏదో పొందాలన్న కాంక్ష. లేని సమస్యలు సృష్టించుకొని తల్లడిల్లిపోవడం, మానసిక శారీరక సమతౌల్యాన్ని కోల్పోవడం, కోరికలకు దాసోహమనడం, మరీచికల వెంట పరుగులు పెట్టడం, ముఖ్యంగా సంతృప్తికి దూరం కావడం... సర్వ సమర్థ జీవితాన్ని చేజార్చుకోవడమే. మన మార్గాన్ని సుగమం చేసే సనాతన ధర్మాలు, ఆచారాలు, కట్టుబాట్లు, సంస్కృతీ సంప్రదాయాలు, మహర్షుల జ్ఞానమార్గాలున్నాయి. పాత్రలతో, కథలతో సందర్భోచితంగా సందేశాన్నిచ్చే పురాణ వాంగ్మయముంది. ప్రతి దశలోనూ వెలుగుదారి చూపించే గురువులున్నారు. దారితప్పితే, సరిదిద్దే మహనీయుల ప్రవచనాలున్నాయి. ఇవే మన జీవితాన్ని నందనోద్యానవనంలో పారిజాత వృక్షాన్ని చేస్తాయి.

లోపలికి చూపు సారించకుండా, బయటి వైపున మాయామేయ ప్రపంచానికి తగ్గట్టుగా మనలో భావ సంచలనం కలుగుతున్నంతకాలం సంతోషమే తప్ప ఆనందాన్ని అనుభూతించలేం. మనలో సకారాత్మక ఆలోచనలతో మార్పు వచ్చినప్పటి నుంచి సమస్త జీవరాశి, ప్రకృతి కొత్తగా కనిపిస్తాయి. శైశవం నుంచి అవసానం వరకు మనం ఆనందంగా జీవించడమే కాదు, నలుగురికీ గంధపు చెట్టులా సువాసనలు పంచుతాం. గంగలా స్వచ్ఛమైన జలాలను అందిస్తాం. ఇంతకన్నా మానవ జన్మను సార్థకం చేసుకునే మోక్షమార్గం ఉండదు.

మన జీవితానికి గతం, భవిష్యత్తు ఉన్నాయో లేవో తెలియదు. వర్తమానం మాత్రం మన గుప్పిట్లో ఉన్న ఇసుక. ఉత్తమత్వాన్ని సిద్ధింపజేసుకొంటూ, జాగ్రత్తగా, సన్నని ధారగా, విడుస్తూ ఉండాలి. గుప్పెట్లోని ఇసుక పూర్తయ్యేసరికి పరిపూర్ణ జీవితాన్ని పొందిన కమనీయానుభూతితో అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలి. పరిపూర్ణంగా పండిన పండును మాత్రమే చెట్టు నేలకు విడుస్తుంది. దానికి ముందున్న ఏ దశలోనూ నేల రాలనివ్వదు. ప్రకృతి నేర్పే పాఠంలో మనకు అన్వయించుకొని నేర్చుకోవలసిన ముఖ్యమైన అంశమిది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి