11, అక్టోబర్ 2020, ఆదివారం

నాన్న రాసిన ఉత్తరం


నాన్న_రాసిన_ఉత్తరం

సమయం అర్ధరాత్రి.
ఎంత ప్రయత్నించినా
నిద్రరావటం లేదు. నాన్న ఉత్తరంలోని ప్రతి అక్షరం నా
తనువులోని అణువణువులోనూ అగ్నిలా రగులుతున్నది.
పక్కన చూస్తే నా శ్రీమతి కోమలి మంచినిద్రలోనే
నవ్వుతున్నది ఏ అందమైన కలగంటున్నదో. దప్పిక
వేస్తుంటే మంచినీళ్ళ కోసం వంటగదిలో కెళ్ళాను.

*అలసిపోయిన అమ్మ*
కొంగుపరచుకొని నేల మీదనే ఆదమరచి నిద్ర
పోతావుంది.
పసుపుపూసిన ముఖంలో నుదుటనున్న ఎర్రబొట్టు
పడమటి కొండల్లో వాలిపోతున్న సూర్యుడిలా కనిపిస్తుంటే...
ముడతలుపడ్డ అమ్మ మోము నెర్రెలు చీలిన భూమాతలా వుంది.

*నీళ్ళు తాగి వెనుతిరిగి బెడ్ రూమ్ కెళుతుంటే వరండాలో నాన్న గురక వినిపించింది.*
*దగ్గరకెళ్ళి నాన్న ముఖం చూశాను యుద్ధం ముగిసిన ప్రశాంతమైన భూమిలా వుంది.*
*నెరసిన తెల్లనిగడ్డం వెండిపోగుల్లా*
*వెన్నెలకిరణాలు పడి మెరుస్తున్నాయి.*
*ఎందుకో ఇపుడు నాన్న నాన్నలా కాక*
*ప్రపంచానికి ప్రేమను పంచే మహర్షిలా కనిపిస్తున్నాడు.* 
కాళ్ళ దగ్గర కూర్చున్నాను నాకు తెలీకుండానే కళ్ళనుండి
నీళ్ళు కారి నాన్న కాళ్ళ మీదపడ్డాయి. తడికి కాళ్ళు
మడిచుకున్నాడే
గానీ మెలుకురాని ఘాడనిద్రలో వున్నాడు.
నేను బెడ్ రూమ్ కి మెల్లగా
నడచుకుంటూ వచ్చి మొబైల్ తీసుకొని
అమ్మానాన్నలకు
అపోలా హాస్పిటల్ అపాయింట్మెంట్ కోసం మెసేజ్
పెట్టాను.
అమ్మనాన్నలకూ ఓ గదిని ఇవ్వాలని,నా రీడింగ్ రూమ్ 
లోని బుక్స్ తీసి గదిని శుభ్రం చేశాను. స్టోర్రూమ్ లోని
మంచంను ఈ రూమ్ లోకి మార్చి దుమ్ముదులిపి రెడీ చేశాను
పొద్దున్నే చైతన్య స్కూల్ హాస్టల్ కెళ్ళి పిల్లలను ఇంటికి తీసుకొచ్చి
డే స్కాలర్ గా పంపాలని నిర్ణయించుకున్నాను.
నా జీవితపుస్తకానికి నూతన అధ్యయాన్ని తెరుస్తూ
తూరుపున సూర్యుడు కొత్తగా ఉదయిస్తున్నాడు.
నాలో ఇంతటి మహత్తరమైన మార్పు తెచ్చిన
నాన్న రాసిన ఉత్తరాన్ని వందోసారి చదవడం
మొదలుపెట్టాను.

*********************
*ప్రియమైన క్రిష్ణకు* 
     మీ నాన్న ఆశీర్వదించి రాయునది ఏమనగా...
_అవును ఏమి రాయాలి?_ విచిత్రంగా వుంది కదూ ! 
ఒకే ఇంట్లో వుంటూ ఇలా ఉత్తరం రాయడం
విచిత్రమే కాదు, చాలా కష్టంగా కూడా వుంది కన్నా.
ఎన్నాళ్ళైంది నీవు నాతో మాట్లాడి. ప్రతి రోజూ నీతో
మాట్లాడాలని ప్రయత్నించి విఫలమవుతునే వున్నా.
నీతో మాట్లాడాలంటే ఉత్తరం
రాయడం కంటే వేరే మార్గం తోచలేదు. అందుకే ఇలా
రాస్తున్నా. ఏమిటీ సోదనుకోక దయచేసి నా కోసం
నాలుగు నిమిషాలు కేటాయించి చదవుకన్నా.
మీ అమ్మ పగలంతా బట్టలుతికి ,వంటచేసి
అందరికీ వండించి వెట్టి చాకిరి చేసి ఎంత రాత్రైనా
నీ కోసం ఎదురు చూస్తుంటుంది. ఏ అర్ధరాత్రో నిద్ర
మత్తుతో నువ్వొస్తావు. నే తినొచ్చాను నీవు పడుకోమ్మా
అంటూ వెళ్ళి పడుకుంటావు. వేళ కాని వేళ ఒంటరిగా
తినలేక నిద్రకు తాళలేక మంచినీళ్ళతో సరిపుచ్చుకొని
కునుకు తీసేది.
మొన్న నేను బజారుకెళ్ళి
కూరగాయలు తెస్తుంటే చత్వారం పెరిగిందేమో,
అంత పెద్దరాయినీ కానక కాలుకి కొట్టుకొన్నాను.
ఆ గాయంకు చీము పట్టి నొప్పెడుతుంటే
నిద్ర రాక నడిరాత్రి మెలుకువ వచ్చి చూస్తే,

మీ అమ్మ పక్కలో లేదు. వెతికి చూస్తే వంటరూమ్ లో
మెంతులు మింగుతూ కనిపించింది. ఏమైందని
అడిగితే
కడపునొప్పిని తట్టుకోలేక మౌనంగా కన్నీళ్ళు
పెట్టుకుంది.
ధర్మాసుపత్రికి తీసుకెళితే అల్సర్ ముదిరిపోయింది
ఆపరేషన్ చేయాలన్నారు.
నాకు షుగర్ టాబ్లెట్లు నీవు తేకున్నా
వేపాకుతింటూ, వాకింగ్ చేస్తూ ఎట్లో నెట్టుకొస్తున్నా.
మీ అమ్మకు అలా వీలుపడదట కన్నా తప్పకుండా
ఆపరేషను చేయించాలట. కష్టసుఖాలు
పంచుకుంటానని
ప్రమాణం చేసి తాళికట్టి ఆలిని చేసుకున్నా. నిను
సాకడంలో తనను ఏనాడూ సుఖపెట్టలేదు.
మీ అమ్మకు ఆపరేషను చేయించడానికి
నా దగ్గర నయాపైసా లేదు.నా పెన్షన్ వాడుకోవడానికి
బ్యాంకు పాస్ బుక్, ఏటియం కార్డు నీ దగ్గరున్నాయి.
ఏమి చేయాలో తోచక మీ ఇద్దరినీ సుఖపెట్టే ఒకే
ఆలోచనతో నా కిడ్నీ బేరం పెట్టాను. ఆ డబ్బుతో
మీ అమ్మకు ఆపరేషను చేయించు.
మీ అమ్మకు బాగయ్యాక ఇప్పటి లాగా ఇంట్లో
పాచిపని చేసి ఓమూల పడివుంటుంది.
నేను దూరంగా ఓ అనాథాశ్రమం చూసుకున్నాను.
మీ అమ్మకు, ఊర్లోని వాళ్ళందరికీ
తీర్థయాత్రలకెళ్ళానని చెప్పు.
మీ అమ్మ పనిచేయలేని నాడు శ్రమనుకోకుండా
నా దగ్గరకు చేర్చు. నిజం తెలిస్తే పిచ్చిది
చచ్చిపోతుంది.
ఎందుకంటే నిన్నెలా సాకానో తెలిసిన ఏకైక వ్యక్తి ఆమే కదా !
ఏడాది బిడ్డప్పుడు జ్వరంతో నీవు
మూసినకన్ను తెరవకుండా వుంటే , నీకు
నయమవ్వాలని
నేను నిన్ని భుజాన ఏసుకొని ఏడుకొండలు ఎక్కితే
మీ అమ్మ మోకాళ్ళతో ఎక్కి ఏడుకొండల వెంకన్నను
దర్శించుకుంది కన్నా అంత ప్రేమ మనమంటే.
చివరిగా ఓ మాట జాగ్రత్తగా వినుకో కన్నా.
అమ్మ ముర్రుపాలతో నా ప్రేమతో నీతికథలు చెప్పి
శ్రీ రామచంద్రుడిలా నిను పెంచాము.కంటికి రెప్పలా
కాచాము. మా పరిస్థితితే ఇలా వుంటే,
పోతపాలు పోసి హాస్టల్లో వుంచి చదివిస్తున్నావు.
నీ భవిష్యత్తు ఎలా వుంటుందో వూహించలేకున్నా.
మనీ కోసం పరుగులు తీసి
మర మనిషిలా బ్రతకక, మనస్సున్న మనిషిగా
సంతోషంగా బ్రతుకు. రాముడిలా అడవులకెళ్ళి
"పితృవాక్య పరిపాలన" పాటించకున్నా,
అమ్మనాన్నలకు పిడికెడు మెతుకులు
గుప్పెడు ప్రేమ పంచితే చాలు. కాస్త పెద్దమనసు
చేసుకొని కొంచెం సమయం కేటాయించి
మీ అమ్మను ఆసుపత్రికి, నన్ను అనాథాశ్రమానికి
పంపు.
నా పెంపంకంలో ఏ లోపముందో, నీవు గ్రహించి
జాగ్రత్త పడి నడచికో, నీ బిడ్డలు నిను బాగా చూడాలి
మాలాంటి బతుకు నీవు బతకలేవు.
ఇక సెలవా కన్నా...

                              ఇట్లు మీ నాన్న !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి