15, అక్టోబర్ 2020, గురువారం

నేను ఎక్కడ????

శివుని నుండి రాలిన విబూథిని పోగుచేసి చక్కటి బొమ్మను తయారుచేసాడు బ్రహ్మ. ఆ బొమ్మను చూసుకుని మురిసిపోతున్న బ్రహ్మగారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడానికి అటుగా వెళ్తున్న విష్ణువు, ఆ బొమ్మకు ప్రాణంపోసాడు. అది తెలిసిన దేవతలు తామూ ఏదో చేయాలని సంకల్పించి ఇంద్రియగుణాధి ఐశ్వర్యములూ ఆ బొమ్మకు ఇచ్చారు. అది విన్న దానవాది రాక్షసులు దేవతల కన్నా తామేమీ తక్కువ కాదని, మేమూ ఇవ్వగలవారమే అని వారువారు ఇవ్వగలిగిన , వారి తాహతకు తగ్గ కామక్రోదాది అరిషడ్వర్గాలను ఆ బొమ్మకు ఇచ్చారు. దానవాదిరాక్షసులు ఇచ్చినవే ఉంచుకోపో, వాళిచ్చినవి నీ దగ్గర ఉన్నాయి కాబట్టి మేమిచ్చిన ఇంద్రియగుణాధి ఐశ్వర్యములు మేమిచ్చినవి మేము తీసేసుకుంటాము అని దేవతలు వారిచ్చినవి వారు లాగేసుకున్నారు. ఈ పరిణామాలు మళ్ళీ దేవదానవుల యుద్దానికి దారితీస్తాయేమో, యందుకొచ్చిన గొడవ అని విష్ణువు తానిచ్చిన ప్రాణం తనే తీసేసుకున్నాడు. అప్పటి వరకూ ప్రాణమున్న ఆ బొమ్మతో ఆడుకోవడానికి అలవాటుపడ్డ బ్రహ్మగారికి ఇప్పుడు ఆ ప్రాణంలేని బొమ్మతో ఆడుకోవడానికి మొహం మొత్తి దానిని మళ్ళీ ముక్కలుముక్కలుగా చేసి దానిని చిదిమేసి మళ్ళీ విభూధిగా చేసేసాడు. శివుడు ఇది నా విభూథి అంటూ మళ్ళీ వంటికి పులిమేసుకున్నారు. అహా ఏమి జరిగింది , ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అనుకునేలోపే...... *నేను ఎక్కడ*?........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి