1, అక్టోబర్ 2020, గురువారం

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కీసరగుట్ట

🙏🛕  దేవాలయము🛕🙏

శ్రీ రామలింగేశ్వర స్వామి కీసరగుట్ట.

🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱

ఆంథ్రప్రదేశ్ లోని రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరుడు స్వయంభువు గా వెలసిన దివ్యక్షేత్రం. క్రీ.శ 4-5 శతాబ్దాల్లో ఆంథ్రదేశాన్ని పరిపాలించిన విష్ణుకుండిన ప్రభువైన రెండవ మాథవవర్మ రాజథానియైన “ఇంద్రపాలనగరం” ఇదేనని చారిత్రక ఆథారాల ద్వారా తెలుస్తోంది. పదకొండు అశ్వమేథయాగాలు చేసి, తన సామ్రాజ్యాన్ని నర్మదానదీ తీరం వరకు విస్తరింపజేసిన మహావీరుడు రెండవమాథవవర్మ. అంటే ఎన్నో యజ్ఞ యాగాదులతో పునీతమైన పవిత్ర భూమి ఈ కీసరగుట్ట. ఈ పుణ్యక్షేత్రం నేటి ఆంథ్రుల రాజథాని భాగ్యనగరానికి 40 కి.మీ దూరంలో ఉంది.
 
శ్రీ రామచంద్రుడు రావణ సంహరణానంతరం అయోథ్యానగరానికి మరలి వెడుతూ, మార్గమథ్యంలో ఈ కొండ మీద కొద్దిసేపు ఆగాడట. ఈ ప్రదేశ ప్రభావమేమో కాని శ్రీ రామచంద్రుని మనస్సులో ఒక ఆలోచన కలిగింది. రావణ బ్రహ్మ సంహరణానంతరం తాను నిర్వర్తిస్తున్న శివలింగాల ప్రతిష్ఠల్లో భాగంగా ఈ కొండపై శివలింగ ప్రతిష్ఠ చేయాలనే ఆలోచన కలిగింది. మహర్షులు ముహూర్తం నిర్ణయించారు. వెంటనే ఆంజనేయుని పిలిచి కాశీ నుండి శివలింగాన్ని తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు కౌసల్యానందనుడు. రామాజ్ఞ కావడమే ఆలస్యం రివ్వుమని ఆకాశంలోకి ఎగిరాడు మారుతి.                        
         
కాని ముహూర్తసమయం సమీపిస్తున్నా కేసరీనందనుని జాడేలేదు. ఆలస్యమౌతోందని ఆలోచిస్తున్న శ్రీరాముని ఎదుట ప్రత్యక్షమయ్యాడు శంకరుడు. ఆత్మలింగాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు. ముహూర్త సమయానికి ప్రతిష్ఠాకార్యక్రమాన్ని ముగించి "థన్యో2హం'' అనుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఇంతలో నూటొక్క శివలింగాలను భుజాలమీద మోసుకుంటూ రామచంద్రుని ముందు నేలకు దిగాడు ఆంజనేయుడు.
                                    
పరిసరాలను చూచి, పరిస్థితిని అర్థంచేసుకున్నాడు మారుతి. తాను పడిన శ్రమంతా వృథా అయిందని అలిగి, బాధతో తాను తెచ్చిన శివలింగాలను కొండపైన చెల్లాచెదరుగా విసిరేశాడు. (ఆ శివలింగాలే ఈనాడు కొండమీద ఆలయ ప్రాంగణం వెలుపల దర్శనమిస్తుంటాయి). మారుతి చేష్టలను చూచి చిరునవ్వుతో అనుగ్రహించాడు సీతా మనోభిరాముడు. తన భక్తుల మనోభవాలను మన్నించగల మహనీయుడు కదా మన శ్రీరాముడు. మారుతిని చెంతకు పిలిచి ఇలా అన్నాడు.   

 "ఆలయంలోని ఈశ్వర దర్శనానికంటే ముందే నువ్వు తెచ్చిన శివలింగాలను, నిన్ను భక్తులు దర్శిస్తారని, ఆ తరువాతే శ్రీ రామలింగేశ్వరుని దర్శిస్తారని'' వరమిచ్చాడు. అంతే కాదు. మారుతి తెచ్చిన శివలింగాల్లో ఒక దానిని ప్రధాన ఆలయానికి ఎడమవైపు కొద్దిదూరంలో శ్రీ రామలింగేశ్వరునికి అభిముఖంగా ప్రతిష్ఠించాడు. (ఆశివలింగాన్నే శ్రీమారుతి కాశీవిశ్వేశ్వరుడుగా భక్తులు సేవించు కుంటున్నారు). అంతే కాకుండా ఇక నుండి ఈ కొండ "కేసరి గిరి''గా పిలువబడుతుందని కూడ అనుగ్రహించాడు ఆంజనేయుని శ్రీరామచంద్రుడు. 

కేసరి ఆంజనేయుని తండ్రి కదా! ఆనాటి నుండి ఆ పేరుతోనే ఈ కొండ కేసరి గిరి, కీసర గిరి, కీసర, కీసరగుట్టగా వ్యవహరించబడుతోంది. ఇదంతా స్వామి తనను అనుగ్రహించడానికి చేసిన పనేనని తెలియని వాడు కాదు గదా మన నవవ్యాకరణ పండితుడు, జ్ఞాన గుణ సాగరుడైన హనుమంతుడు. అందుకే వినయంగా చేతులు జోడించి, స్వామి ముందు నిలబడి పోయాడు భక్తాంజనేయుడై.                      
 
ప్రథాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇందులో ఫ్రథాన దైవం శ్రీరామలింగేశ్వరుడు. ఈశ్వర ప్రసాదితమై, శ్రీరామచంద్రుని చేత ప్రతిష్ఠించబడుటం వలన ఇది స్వయంభూలింగమై పూజలందుకుంటోంది. ప్రథానాలయం ముఖమండప, అంతరాలయ, గర్భాలయాలుగా నిర్మించబడింది. మహామండపాన్ని ఇటీవల నిర్మించారు.

 ముఖమండపంలో శ్రీస్వామి వారికి కుడి ఎడమలుగా రెండు ఉపాలయాలు ఉన్నాయి. కుడివైపున ఉన్న ఉపాలయంలో పార్వతీదేవి, ఎడమవైపు పాలయంలో శివగంగాదేవి దర్శనమిస్తారు. ముఖమండపంలో స్వామికి కుడివైవున ఉన్న వేదికపైన ఆంజనేయుడు, వినాయకుడు, శివలింగము, ఎడమవైపున ఉన్నవేదికపైన వల్లీదేవసేనా సమేత కుమారస్వామి కొలువుతీరి ఉన్నారు.  
 
ధ్వజస్థంభము చెంత కాలభైరవమూర్తిని మనం సేవించుకోవచ్చు. శ్రీ స్వామికి ఎదురుగా భక్తులు ఇచ్చేముడుపులను కాపలాకాస్తూ, ప్రభువు ఆజ్ఞకు దివారాత్రాలు ఎదురుచూసే నందీశ్వరుడు ప్రత్యేకమండపంలో గంభీరముద్రలో దర్శనమిస్తాడు. కోరికలు తీర్చే తండ్రిగా భక్తులు ఈ స్వామిని సేవిస్తారు. రాహుకేతు పూజలు ఇక్కడ ప్రత్యేకం. శ్రీ రాముని చేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడుగా ఈయన శ్రీ రామలింగేశ్వరుడైనాడు.

 ప్రదక్షిణ మార్గం చూసుకొని, శ్రీ స్వామివారి ఎడమవైపుకు రాగానే కొంచెం దూరంలో శ్రీ మారుతి కాశీవిశ్వేశ్వరాలయం ఆహ్వానం పలుకుతుంది. ఆ స్వామిని దర్శించుకొని, కొద్దిగా ఎడమకు నడిస్తే ప్రత్యేక ప్రాంగణంలో అక్కన్న- మాదన్న ఆలయాలు కనిపిస్తాయి. (అక్కన్న-మాదన్నలు గోల్కొండ(గొల్లకొండ) సంస్థానంలో మంత్రులు)ఒకే కప్పుక్రింద నిర్మించబడిన మూడు ఆలయాలు ఇవి. వీటికి క్రీ.శ 2005లో పునర్నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి. గర్భాలయం, అంతరాలయం, వేరువేరుగా ముఖమండపం కలిపి నిర్మాణం జరిగింది. ఈ ఆలయాల్లో మధ్యగుడిలో శివపంచాయతనాన్ని, వారికి కుడివైపు శ్రీలక్ష్మీనరసింహస్వామిని, ఎడమవైపు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తిని ప్రతిష్ఠించారు. 

ముఖమండపంలో చిన్నమందిరాలలో వివిధ దేవీ, దేవతా మూర్తుల విగ్రహాలను మనం చూడవచ్చు.
ఈ ఆలయాలకు వెనుక వైపు నాగదేవత ఆలయం నిర్మించబడింది. సంతానార్థులైన సువాసినులు ఇక్కడ ప్రత్యేక పూజలు, ముడుపులు చెల్లిస్తారు. సంతానవతులైన అనంతరం మొక్కులు తీర్చుకుంటారు. ఆలయానికి ఎదురుగా మరొక ఆంజనేయ ఫలకం కన్పిస్తుంది. దీని ప్రక్కనే అక్కన్న-మాదన్నలు వేయించిందిగా చెపుతున్న భక్తాంజనేయ ముద్ర కల్గిన ఏకశిలా జయస్థంభాన్ని చూడవచ్చు.

 ఆలయ ప్రాంగణం వెలుపల ఎక్కడ చూసినా శివలింగాలే కన్పిస్తాయి. శివరాత్రి పర్వదినాల్లో భక్తులు వేలకొలది ఈ క్షేత్రానికి తరలివస్తారు. ఆనాడు భక్తులు ఎవరికి వారు ఒక్కొక్క శివలింగాన్ని ఎన్నుకొని స్వహస్తాలతో ఆ స్వామికి అభిషేకం చేసి, విభూతి పూసి, బొట్టుపెట్టి, పూమాలలు వేసి, టెంకాయకొట్టి పూజించేటప్పుడు వాళ్ల ముఖాల్లో కన్పించే ఆనందం అనిర్వచనీయమైంది.ఆలయానికి అభిముఖంగా దూరంగా కొండమీద మరొక భక్తాంజనేయ మందిరం కన్పిస్తుంది. దీనికి వెనుక భాగంలో పన్నెండడుగుల అడుగుల ఎత్తైన వేదికపై ముకుళితహస్తుడైన మరొక శ్రీ ఆంజనేయమూర్తి స్వామికి అభిముఖంగా దర్శనమిస్తాడు.

 ఆం.ప్ర. పురావస్తుశాఖ వారు ఈ కొండమీద జరిపిన త్రవ్వకాల్లో ఈ ప్రదేశ పవిత్రతను ఇనుమడింప చేసే విశేషాలు ఎన్నో వెలుగు చూశాయి. క్రీ.శ 4-5 శతాబ్దాల్లో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన విష్ణుకుండినులలో ప్రసిద్ధుడైన రెండవమాథవవర్మ రాజథాని ఇంద్రపాలనగరము ఇదేననడానికి ఆథారాలు లభించాయి. ఈ మహారాజు వేయికి పైగా యజ్ఞ యాగాదులను నిర్వహించిన మహాపురుషుడు. పదకొండు అశ్వమేథ యాగాలను చేసి, ఆంద్రసామ్రాజ్యాన్ని నర్మదానదీ తీరం వరకు విస్తరింప చేసిన మహావీరుడు. 

ఈ ప్రదేశంలో జరిపిన త్రవ్వకాలలో ఈ కొండచుట్టు విస్తృతపరిథిలో పెద్దపెద్ద ఇటుకలతో నిర్మించిన కోటగోడ పునాదులు, రాజప్రాసాదం, పూజామందిరాలు, వివిథ కట్టడాలు బయటపడ్డాయి. శివలింగాలు, నంది, గణేశుడు మొదలైన దేవతాప్రతిమలు, పాత్రలు, నాణేలు, పూసలు మొదలైనవి వెలుగుచూశాయి. ఇప్పటికీ పరిక్షగా చూస్తే అక్కడక్కడ కొన్ని శిథిల కట్టడాలు మనకు కన్పిస్తున్నాయి ఆలయం వరకు చక్కని ఘాటురోడ్డు సౌకర్యం ఉంది.  

హైద్రాబాద్ నుండి 40 కి.మీ దూరంలో ఉన్నఈ ఆలయానికి ఇ.సి.ఐల్ నుండి, నగరంలో వివిథ ప్రాంతాలనుండి రవాణాసౌకర్యాలున్నాయి. కొండమీద భోజన, ఫలహార , తేనీరుకు హోటల్సు ఉన్నాయి. అన్న దానసత్రాలు కూడ కొన్ని ఉన్నాయి. చక్కని ప్రకృతి ఒడిలో, ప్రశాంతమైన వాతావరణంలో వెలసిన శ్రీ రామలింగేశ్వరుని కీసరగుట్ట చూడదగిన దివ్యక్షేత్రం.

హిందూ సంప్రదాయాలను ఆచరిద్దాం-పాటిద్దాం

🙏ఓం అరుణాచలశివాయ నమః🙏
🙏సర్వేజనా సుఖినోభవంతు 🙏
🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి