3, అక్టోబర్ 2020, శనివారం

నేను నేనే

గాలికి సముద్రంలో అల లేస్తుంది. అల వేరు, సముద్రం వేరుగా అనిపిస్తుంది. నీలం రంగులో కనిపించే సముద్రం, నురుగుతో తెల్లగా ఉండే అల వేరుగా తోచడం సహజం. సాగరంలో పుట్టి, దానిలోనే లయం అయ్యే అలలు ఒకదానితో ఒకటి ఆధారపడి ఉంటాయి. మనిషి భగవంతుడి నుంచి జన్మించి ఆయనలోనే లీనమయ్యే ప్రక్రియ- భిన్నత్వంలో ఏకత్వానికి దర్పణం.

‘నేను నేనే’ అనుకోవడం మనిషి లక్షణం. భగవంతుడితో సంబంధం లేదని కొందరు భావించవచ్ఛు ఆయనపై ఆధారపడనట్లు తలచినా, సముద్రం-అలకు ఉన్న బాంధవ్యం మనిషికి-భగవంతుడికి మధ్య ఉన్నదని పెద్దలు చెబుతారు.

నేను నాలానే ఉంటాను, ఎవరి కోసం నేను మారను, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, నా ఇష్టం నాది... అనేవి మనిషి పెంచుకునే అహంకారాలు. తల్లిదండ్రులు పసితనం నుంచి తమ పిల్లలకు అందరిలా ఉండవద్దు, గొప్పగా ఉండాలి. నీ ప్రత్యేకత కనిపించాలి అని నేర్పుతారు. ‘నేను నేనే’ అనే అహం వయసు పెరిగిన కొద్దీ బలపడుతుంది. నాకన్నా తెలివి కలవాడు, నాకన్నా సమర్థుడు లేడు అని భావిస్తాడు.

‘నేను’ నుంచి మనం వరకు ప్రయాణం చేయడమే ఆధ్యాత్మిక సాధన. అంతర్యామి ప్రబోధించే విభూతులు పిల్లలకు చుక్కల మందు వంటివి. సంస్కారవంతమైన మహర్షుల దివ్య సూక్తులు పిల్లలకు చెప్పగలిగితే, అవి జీవిత పర్యంతం వారి వెన్నంటి ఉంటాయి.

‘నేను నేనే అనే అహాన్ని వీడటం సులభం కాదు. దానికి సాధన కావాలి. నాదేమీ లేదు. నేను నిమిత్తమాత్రుడిని అనుకోవాలంటే మూడు రకాల సాధనలు అవసరమని పెద్దలు పేర్కొంటారు.

మొదటిది త్యాగం. తనకున్నదానిలో కొంత ఇతరులకు పంచడం దానం. తనకున్నదంతా ఏ ప్రయోజనాన్నీ ఆశించక ఇవ్వడం త్యాగం. భీష్ముడు తండ్రి కోసం రాజ్యాన్ని, దాంపత్య జీవితాన్ని త్యాగం చేశాడు. కర్ణుడు తనకున్నదానిలో కొంత దానం చేశాడు.

బలి చక్రవర్తి దానిశీలిగా పేరు తెచ్చుకున్నా, అహంతో పాతాళానికి దిగిపోయాడు. శిబి చక్రవర్తి తన శరీరం నుంచి మాంసాన్ని కోసి డేగకు అందించి త్యాగశీలిగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు. త్యాగం మనిషి స్వార్థాన్ని తగ్గిస్తుంది. కోరికలను అదుపు చేస్తుంది. పరోపకారాన్ని ప్రోత్సహిస్తుంది. సమస్త లోకాలు సుఖంగా ఉండాలనే శాంతి మంత్రంగా పని చేస్తుంది.

రెండోది కృతజ్ఞత. ఇతరులు చేసిన సహాయానికి కృతజ్ఞత తెలపడం. మనిషి జన్మించినప్పటి నుంచి మరణించే వరకు ఆహారం, గాలి, నీరు ప్రకృతి నుండి ఉచితంగా పొందుతాడు. మరొకరికి అవి అందే విధంగా మొక్కలు పెంచడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఆహారాన్ని వృథా చేయక పొదుపుగా వాడుకొనేదే కృతజ్ఞత.

మనిషి సృష్టిలోని సమస్తానికి ధన్యవాదాలు సమర్పిస్తూ అందరి కోసం కృషి చేయడం అతడిలోని నేను నేనే అహాన్ని మరిపిస్తుంది.

మూడోది నిష్కామ సేవ. కోరికతో చేసేది సహాయం. ఎటువంటి ప్రయోజనాన్నీ ఆశించక తన కర్తవ్యంగా భావించి చేసేది సేవ.

తల్లి పిల్లలకు సేవ చేస్తుంది. తన కర్తవ్యంగా భావిస్తుంది. వారు కోరకున్నా వారి అవసరాలు గుర్తించి, తీరుస్తుంది. సేవలో విశ్వజనీన ప్రేమ కలుగుతుంది. ఆంజనేయుడు ఏమీ ఆశించకుండా శ్రీరాముడికి సేవ చేయడం నిష్కామ కర్మకు నిదర్శనం. భూమి మొలకెత్తడం, గాలి వీచడం, వెలుతురు ప్రసరించడం- ప్రకృతి జీవులకు అందించే సేవలు. నేను నేనే అనే భావాన్ని వీడి- నేను అందరి కోసం అనుకునే విశాల భావమే... భారతీయ సంస్కృతి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి