10, అక్టోబర్ 2020, శనివారం

పూజ - భక్తి ???

*మనిషి తనకు మానవజన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు.* 👍👍💐

*పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించు కుంటూ ఉంటాడు.* 

*ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమోగానీ, అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా?* 

*ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు.*

 *భగవంతుడిదే ఆ యావత్‌సృష్టి. అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే.*

 *కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు.*

*పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు.*

 *అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది.*

 *పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు- 'పరమేశ్వరా!* 

*నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు. కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి?* 

*అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి?* 

*నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు?*

 *పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా?*

 *నిత్యనిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి?*

 *ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి?* 

*గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా?* 

*ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి?* 

*నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు?* 

*మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా?*

 *నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా?* 

*జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా?*

 *నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు?* 

*విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తి పరచగలనా?*

 *అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి?*

 *అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి?* 

*వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి?'*

*ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు.* 

*భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే.* 

*వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు.* 

*అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది.*

 *నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు.*

 *వస్తువులు అంతకన్నా కావు.* 

*ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు.* 

*భక్తితో స్మరిస్తే చాలునంటాడు.*

 *కానీ మనిషి మనసు చంచలం. చపలం. స్థిరంగా ఒకచోట ఉండదు.* 

*లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు.* 

*అందుకే....... శంకరభగవత్పాదులు-* 

*'ఓ పరమేశ్వరా! నా మనసు ఒక కోతి వంటిది.* 

*అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది.*

 *భార్యాపుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది.* 

*క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది.*

 *అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను.* 

*దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో' అని ప్రార్థిస్తారు.*

 *సామాన్య భక్తులను తరింప జేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది.*

*'ఓ పరమేశ్వరా! బంగారుకొండ మేరుపర్వతమే నీ చేతిలో ఉంది. అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు.* 

*కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి.*

 *షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు.*

 *సమస్త మంగళాలనూ కలిగించే జగన్మాత సర్వమంగళయై నీ పక్కనే ఉంది.* 

*కనుక నీకు నేనేమీ ఇవ్వలేను.* 

*నా దగ్గర ఉన్నది ఒక్క మనసే. అది నీకు సమర్పిస్తున్నాను!'* 

*అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు.*

*అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు.*

 *భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు.*

 *అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కావు.*

 *💗హృదయార్పణమే💖 పూజ.* 
*నిశ్చల ధ్యానమే భక్తి*

 *అంతేకానీ లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు. ఈ సత్యాన్ని మనిషి గ్రహిస్తే మేలు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి