10, అక్టోబర్ 2020, శనివారం

మారేడు పత్రం - ఆరోగ్యం

హిందువుల మారేడు పత్రం ,పండుల పైనా వుండే విశ్వాసాలు , ఆధునిక శాస్త్రం ప్రకారం ఉండే ఆరోగ్య రహస్యాలు... 

"మారేడు చెట్టు" పేరులో చాలా గొప్పతనం ఉంది.‘మారేడు’ తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు. 
దీనిఅర్ధం అన్నిటినీ ఇవ్వగలదు" ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.
లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు.అందుకే ఆ చెట్టుకు పండిన కాయను‘శ్రీఫలము’అని పిలుస్తారు.
సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.
మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. 
మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. 
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!అని తలుస్తాము.
దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.
 అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి. 
పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి.
కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. 
మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి.
మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.
ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసే వారికీ ఫలితం దక్కుతుంది.
శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట. ‘బాల్యం, యౌవనం, కౌమారం ఈ మూడింటిని నీవు చూస్తావు’అని ఆశీర్వదిస్తాడుట.కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. 
శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.
మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది.
ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి "శ్రీసూక్తం"లో ‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాంవృణే’ (అమ్మా అ లక్ష్మిని దరిద్రమును పోగొట్టెదవుగాక) అని చెప్తాము. మనిషికి మూడు గుణములు, మూడు అవస్థలు ఉంటాయి. నాల్గవదానిలోకి వెళ్ళడు. నాల్గవది తురీయము. తురీయమే జ్ఞానావస్థ.
తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.
 మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. 
 ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది.
 యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.
 శాస్త్రము మనకు లఘువులు నేర్పింది.మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.
మారేడు ఫలము దాని శాస్త్రీయ ప్రయోజనాలు :

మారేడు దళాన్ని సోమ, మంగళ వారాల్లోనూ, ఆరుద్రానక్షత్రమ్రోజునా, సంధ్యాసమయాన, రాత్రి పూటా, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగరోజుల్లోనూ కోయకూడదు. ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచి మరునాడు పరమశివుని పూజిస్తాం. మారేడుదళము గాలిలోని, నీటిలోని దోషము లను శుధ్ధిచేస్తుంది.
ఈ బిళ్వపత్రాలలోని ఔషధ గుణాలు ఇలా ఉన్నాయి.మినరల్స్, విటమిన్స్, కాల్షియం , పాస్పరస్ , ఇనుము , కెరోటిన్, బి-విటమిన్, సి-విటమిన్ ఉన్నాయి.మారేడు ఆకులలో, పళ్లలో చాలా ఔషధ గుణాలున్నాయి.బిల్వ వృక్షములో ప్రతి భాగము మానవాళికి మేలు చేసేదే.  
అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందుగా పనిచేస్తుంది.. మొలలకు ఇది మంచి ఔషధం. దీని ఆకుల రసం చక్కెర వ్యాధి నివారణకు చాలా బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో దీని వేరు వాడుతారు.
బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి, బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది . 
కడుపు లోను, పేగుల లోని పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది.
 బిల్వ ఆకులకు, ఫలాలకు మలేరి యాను తగ్గించే గుణం ఉంది,
బిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధవ్యాధులకుంపనిచేస్తుంది. 
బిల్వ వేరు, బెరడు, ఆకులను ముద్దగా నూరి గాయాల మీద పూస్తే త్వరగా మానుతాయి.
క్రిమి, కీటకాల విషానికి విరుగుడుగా ఇది పనిచేస్తుంది . మారేడు పండ్ల వాసన చాలా బాగా ఉంటుంది. 
దీనికి శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే చాలాకాలంగా బాధించే మలబద్ధ సమస్య నివారణ అవుతుంది. 
మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బావుంటుంది.
ప్రేవులను శుభ్రపరచడమే కాకుండా, వాటిని శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది. మారేడులో ఉన్న విచిత్రం ఏమిటంటే బాగా పండిన పండు విరేచనకారిగా ఉపయోగపడితే, సగంపండిన పండు విరేచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది.
మారేడు ఆకుల కషాయాన్ని కాచుకుని తాగితే హైపవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. 
మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది. 
మారేడు ఆకులకు వూబకాయాన్ని తగ్గించే గుణముంది. మొహాలీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
కమలేశ్ కె. భుటానీ నేతృత్వంలోని పరిశోధకులు మారేడు ఆకుల్లోని అంబెలీఫెరోన్, ఎస్క్యూలెటిన్ అనే రసాయనాలు వూబకాయాన్ని తగ్గిస్తున్నట్లు ఋజువుచేశారు.మారేడు ఆకుల్లోనే కాదు మారేడు పండ్ల లోనూ ఈ రసాయనాలు ఉన్నాయని ఋజువైంది. 
మూడు విషయములు హిందూశాస్త్రంలో చెప్పబడ్డాయి.

ఏది చేతనయినా కాకపోయినా 
మీ జీవితమును పండించు కోవడానికి, వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే
ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి 
మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే, 
మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి 

మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం.
రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట. 
మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట. 
ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.
భారతదేశంతో పాటుగా ఆసియా దేశాలలో చాలా వరకూ మారేడు చెట్టు పెరుగుతుంది. ఈ పత్రి చెట్టు,మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. బిల్వ,తెలుగు వారి కి సుపరిచిత నామంమారేడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి