18, జనవరి 2023, బుధవారం

ప్రదోష వ్రతం


శాండిల్య మహర్షి ప్రదోష వ్రత విధానాల గురించి వ్రతకథ గురించి వివరిస్తాడు🍁

ప్రదోష వ్రతం 


🌺ప్రదోషమనే పదానికి సంధ్యాసమయమని అర్థం. మహాశివుడిని ధ్యానిస్తూ ప్రదోషవ్రతం నాడు అంటే ఉపవాసం ఉంటారు. ఈ రోజునాడు సంధ్యాసమయంలో పరమశివుడిని ధ్యానిస్తే విజయం, ఆరోగ్యం అలాగే మంచి జీవిత భాగస్వామిని పొందుతారని భక్తుల నమ్మకం.

🌺పూజా విధివిధానాలు
పేరుకు తగ్గట్టుగానే ప్రదోషవ్రత పూజను సాయంత్రం వేళలో జరుపుతారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంసమయాన స్నానం చేసి తెల్లటి వస్త్రాలను ధరించాలి. అప్పుడు, దైవానికి పూజ చేయాలి. ఆదిదంపతులు, పార్వతీ పరమేశ్వరులకు, గణేషుడిని, స్కందుడిని అలాగే నందిని పూజించాలి. రాత్రంతా భక్తి పాటలతో, ప్రార్థనలతో దైవాన్ని పూజించాలి. బిల్వపత్రం, గంగాజలం, అక్షతలు, ధూపదీపాలతో పూజను చేయాలి.

🌺ప్రదోష వ్రత కథ
ఒకప్పుడు చాలా పేద బ్రాహ్మణ మహిళ ఉండేది. ఆమె పరమ భక్తురాలు. ఆమెకి ఒక కుమారుడు కలడు. ఒకసారి ఒక బాలుడు నదీతీరంలో ఏడుస్తూ ఈవిడకు తారసపడ్డాడు. ఆ అబ్బాయిని తనతో పాటు తీసుకెళ్లి ఆలనా పాలనా చూసేది. ఆ తరువాత కోవెలను సందర్శించింది. శాండిల్యుడనే ఋషిని కలిసింది. అప్పట్లో, శాండల్యుడు పేరొందిన ఋషి. ఈ అబ్బాయి గురించి ఆమె శాండిల్యుడిని అడగగా, ఈ అబ్బాయి విదర్భ రాజ్య యువరాజని, ఒక యుద్ధంలో తన తండ్రిని కోల్పోయాడని తెలుస్తుంది.


🌺ఆ అబ్బాయి గురించి దిగులు చెందిన ఈ మహిళ అతడిని దత్తత తీసుకోవాలని భావిస్తుంది. అప్పుడు, ఆ ఋషి ఈ మహిళకు ప్రదోషవ్రతాన్ని చేయమని సూచిస్తాడు. అలాగే, ఆమె కుమారుల చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేయమని ఆదేశిస్తాడు. అంగీకరించిన ఈ మహిళ ఆ రోజు ఉపవాసాన్ని చేయాలని భావిస్తుంది. ప్రదోషవ్రతం నాడు ఆచరించవలసిన విధివిధానాల గురించి అలాగే ప్రదోష వ్రత కథ గురించి వివరించమని శాండిల్యుడిని కోరుతుంది. అప్పుడు, శాండిల్య మహర్షి ప్రదోష వ్రత విధానాల గురించి వ్రతకథ గురించి వివరిస్తాడు. అప్పటినుంచి, ఉపవాసం ఉంటూ మహాశివుడిని ధ్యానించడం ప్రారంబిస్తారు.

🌺ఒకరోజు, ఈ ఇద్దరు బాలురు అడవికి వెళతారు. లోతైన అడవిలోకి వెళ్ళినప్పుడు వీరికి ఆడవారి గొంతులో పాటలు వినిపిస్తాయి. చిన్నవాడైన శుచివ్రతుడు ఆ గొంతులు గంధర్వకన్యలవని గుర్తించి అక్కడ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. ధర్మగుప్తుడు, శుచివ్రతుడి మాటలతో ఏకీభవించడు. గంధర్వకన్యలను కలవాలని నిర్ణయించుకుంటాడు. అక్కడికి వెళ్ళగానే, గాంధర్వరాజు కుమార్తె అయిన అన్షుమతిని చూస్తాడు. మొదటి చూపులోనే వీరిద్దరూ ప్రేమలో పడతారు. రెండవసారి కలవగానే, ఇతనే విదర్భ రాజ్య యువరాజని గాంధర్వరాజు గ్రహిస్తాడు. అప్పుడు, ధర్మగుప్తుడితో తన కుమార్తె వివాహాన్ని జరిపిస్తాడు.

🌺వీరిద్దరి పెళ్లి వలన యువరాజు ధర్మగుప్తుడికి సౌభాగ్యంతో పాటు మంచి రోజులు వచ్చాయి. అలాగే, ధర్మగుప్తుడి సోదరుడికి వారి తల్లికి కూడా మంచిరోజులు వచ్చాయి. తన తండ్రి కొల్పోయిన రాజ్యాన్ని యుద్ధంలో గెలిచి తిరిగి దక్కించుకుంటాడు. ఆ బ్రాహ్మణ మహిళ శివుడిని ఆరాధించడం వలన తిరిగి మంచిరోజులను తీసుకురాగలిగింది. ఇదంతా మహా శివుడిని ఆరాధించడం వలెనే సాధ్యమైంది. అందువలన, ప్రదోష వ్రతాన్ని ఆచరించి మహాశివుడి ఆశీస్సులను పొందామని రాజ్యంలోని ప్రజలను ఆదేశిస్తాడతడు.

🌺ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలిగే లాభాలు:
స్కంద పురాణంలో ప్రదోష వ్రతం గురించి వివరించబడింది. ప్రదోషవ్రతాన్ని ఆచరించడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. ప్రదోష వ్రతం అనేది ఆచరించే రోజును బట్టి ఫలితాలను అందిస్తుంది. ఆదివారం నాడైతే మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. సోమవారం నాడు కోరికలను తీరుస్తుంది. మంగళవారం నాడు వ్యాధులను నయం చేస్తుంది. బుధవారం నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే కోరికలు తీరతాయి. గురువారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే శత్రువులు ఉండరు. శుక్రవారం నాడు ఆచరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. శనివారం నాడు ఆచరిస్తే కుమారుడు కలుగుతాడు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి