19, జనవరి 2023, గురువారం

జనకపూర్ జానకీ మాతా దేవాలయం

🚩🚩
జనక్పూర్ జానకి
🚩🚩

🚩క్షేత్ర దర్శనం🚩

రామాయణ,
మహాభారత కాలం నాటి నైసర్గిక స్వరూపానికి నేటి భారతదేశ నైసర్గిక స్వరూపానికి పోలికేలేదు. ఆ యా యితిహాసాలలో పేర్కొనబడిన అనేక రాజ్యాలు కొన్ని ఇప్పుడు మన పొరుగుదేశాలలో వుండడాన్ని గమనించవచ్చును.

త్రేతాయుగంలోని రామాయణ సీతారాముల పరిణయగాధ విదేహదేశంలో జరిగింది. విదేహ రాజ్యాధీశుడు జనకమహారాజు. ఆయన రాజధాని నగరం మిధిల. ఆ మిధిల ఇప్పుడు మన సరిహద్దు దేశమైన నేపాల్ లో వున్నట్లు గుర్తించారు.

దేశం సుభిక్షంగా వుండాలనే సత్చింతనతో జనక మహారాజు ఒక మహా యజ్ఞాన్ని తలపెట్టి అందుకుగానూ భూమిని దున్నుతూండగా నాగేటిచాలుకు ఒక అందమైన మందసం అడ్డుపడింది. దానిని తెరచిచూడగా అందులో చిరునవ్వులు చిందిస్తూ చందమామలాంటి ఒక పసిపాప వుంది. జనకమహారాజు మహా సంతోషంతో ఆ పాపను తన భార్యకు అందించి అపురూపంగా పెంచడం మొదలెట్టాడు. ఆ పాపకు సీత అని పేరు పెట్టాడు.

ఇలావుండగా ఒకరోజు త్రిలోకసంచారియైన నారద మహర్షి జనకమహారాజు వద్దకు వచ్చాడు. జనకుడు తనకు అపూర్వంగా లభించిన పసిపాప గురించి నారదుడికి తెలియజేశాడు.
జనకుడు చెప్పినది విన్న నారదమహర్షి
 "జనకమహారాజా !
నీకు దొరికిన పసిపాప సామాన్యురాలు కాదు.
సర్వశక్తిమంతుడైన పరమాత్ముడు దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధం
రావణుని సంహరించడానికి, ఒక మానవునిగా , దశరధమహారాజు పుత్రునిగా రాముడిగా అవతరించ సంకల్పించాడు.

ఇప్పుడు నీ భవనంలో సీత ఆనే పేరుతో పెరుగుతున్నది శ్రీమహాలక్ష్మి యోగమాయగా ఆ పెట్టిలో
ఆవిర్భవించినది.
అందువలన నీ పుత్రికని తప్పక శ్రీ రామునికే యిచ్చి పరిణయం చేయాలి. అది దైవసంకల్పం.లోక కళ్యాణం కోసం సీతారాముల కళ్యాణం ఎంతైనా అవసరం" 
అని నారదుడు ఉపదేశించి వెళ్ళిపోయాడు.

నారద మహర్షి చెప్పిన దేవరహస్యం తెలుసుకున్నప్పటి
నుండి జనకుడు సీతను
రామునికిచ్చి వివాహం చేయడానికి కావలసిన ప్రణాలికను సిధ్ధంచేసి ఒక నిశ్చయానికి వచ్చాడు.

పరమేశ్వరుడు త్రిపురాలతో సమరం చేసినప్పుడు ఉపయోగించిన అతి శక్తివంతమైన ధనుస్సును జనక మహారాజు తాతకు కానుకగా ఇచ్చాడు.
ఆ విల్లును ఎక్కుపెట్టిన మహావీరునికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి సీతా స్వయంవరం ప్రకటించాడు.
స్వయంవరానికి విచ్చేసిన రాజాధిరాజులెందరో 
ఆ శివధనుస్సును ఎత్తలేక భంగపాటుపడ్డారు.
అప్పుడు తన సోదరుడు లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షితో మిధిలానగరానికి విచ్చేసిన
 శ్రీ రాముడు ఆ శివధనుస్సును వంచడానికి సంసిధ్ధుడైనాడు. 
ఐదువేల మంది మహావీరులు మోసుకువచ్చి సభామండపంలో పెట్టిన ఆ విల్లును శ్రీ రాముడు ఒక ఆట వస్తువులా సునాయాసంగా తన ఎడమ చేతితో
ఆ విల్లును ఎత్తిపట్టి నారి బిగించాడు. కుడి చేత్తో కొంచెము వంచాడు . అంతటి విల్లు పుటుక్కున విరిగింది. అవతారపురుషుడైన రామునిపై
దేవతలు పూల వాన కురిపించారు. అనేక
స్తోత్రాలతో కీర్తించారు.
అప్సరసలు నాట్యమాడారు.
అప్పుడు బంగారు దేహఛ్ఛాయ కలిగిన సీతాదేవి సకలాభరణశోభితయై కుడి హస్తమున సుమమాలను ధరించి,
పట్టు వస్త్రాలు ధరించి కాళ్ళ నూపురాలు మ్రోగుతుండగా,సిగ్గు
మోమున చిరునవ్వులు చిందాడగా
శ్రీ రాముని మెడలో పూమాలను వేసింది.

ఇటువంటి అద్భుతమైన చారిత్రాత్మక సీతా స్వయంవరం జరిగిన
స్థలం ఈనాటి నేపాల్ దేశంలో జనక్పూర్ నగరంలో ఒక పెద్ద రాజభవనంగా రూపొందింది.
ఈ రాజ భవనంలోనే సీతాదేవి పెరిగి పెద్దదైనదని , ఈ రాజభవనంలోనున్న కళ్యాణ మండపంలోనే
సీతారాముల కళ్యాణం జరిగినదని చెపుతారు.

సీతాదేవి మందిర్ గా ప్రసిధ్ధికెక్కిన 
ఈ భవనం నేపాల్, రాజస్థాన్, మొగలాయి శైలిలో అద్భుత శిల్ప కళా నైపుణ్యంతో నిర్మించబడినది. 

కళ్ళు మిరుమిట్లు గోలిపే సౌందర్యంతో 
జనక్పూర్ జానకీ మందిర్
నిర్మించబడినది.
విశాలమైన మండపంలో
గర్భగుడి మధ్యన ఉన్నతమైన
రజిత వేదిక మీద శ్రీ రామచంద్రుడు , సీతాదేవి, 
లక్ష్మణుడు, భరత శతృఘ్నులు, ఆంజనేయ స్వామి మొదలైనవారు కొలువై వుండగా ఇది ఒక
రాజభవనంగానే కాకుండా, 
శ్రీ రాముని ఆలయంగా కూడా దర్శనమిస్తుంది.  
ఈ వెండి మండపంలో రామాయణ దృశ్యాలు అత్యద్భుంతగా చెక్కబడి చూపరులకు అమితానందం కలిగిస్తాయి.

ఈ కోటలో
హనుమంతునికి, మహావిష్ణువుకి, వేణుగోపాలస్వామి కి
ప్రత్యేక ఆలయాలు వున్నవి.
ఈ సీతారాముల వివాహమండపం జబల్పూర్
మహారాజుల పోషణతో నిర్మించబడినది.
ఈ మండపంలో సీతారాముల
కళ్యాణ దృశ్యాలు, మునులు
మహారాజులు పరివేష్టితులై
వుండగా సీతారాముల కళ్యాణ దృశ్యాలు నయనానందకరంగా యాత్రికులను సమ్మోహనపరుస్తాయి.కళ్యాణానంతరం
సీతారాములు అయోధ్యకి తరలినప్పుడు ఒక ముని కూడా వెంటవెళ్ళి వచ్చారు. ఆయన
తిరిగి వచ్చినప్పుడు మధ్యమార్గంలో
ఒక హోమగుండం నుండి బంగారు సీతాదేవి విగ్రహాన్నీ తీసుకు వచ్చారు. మిధిలానగర ప్రజలంతా కలసి ఎంతో ఉత్సాహంతో ఆ బంగారు విగ్రహాన్ని ఈ జనక్పూర్
రాజభవనంలో ప్రతిష్టించారు.

కాలక్రమేణా ,
స్త్రీలు తమవివాహ భాగ్యానికై
సంతాన భాగ్యానికి ఈ మూర్తిని భక్తి శ్రధ్ధలతో పూజించసాగారు.

ఈ జానకీమందిర్ లో జరపబడే వివాహ
పంచమి శ్రీ సీతారామకళ్యాణం జరిగిన 
మార్గశిర మాస శుక్లపక్ష
పంచమి రోజున వైభవంగా జరుపుతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి