26, జనవరి 2023, గురువారం

💐గురు మహిమ 💐


ఈ ధర్మములన్నీ సకల మానవ జాతి తప్పక ఆచరించదగినవని గోకర్ణుడు చెప్పెను🌹

గురు మహిమ


🍁జగన్మాత పార్వతీదేవి "గురుమహిమ" గురించి శివపురాణంలోని పార్వతీఖండంలో తెలిపిన విశేషాలు.

🍁శ్లోII గురూణాం వచనం పథ్యం ఇతి వేదవిదో విదుః
గురూణాం వచనం సత్యం ఇతి యేషాం దృఢా మతిః
తేషామిహాముత్ర సుఖం పరమం నా సుఖం క్వచిత్ II 
(శి.పు.రు.సం.పార్వతీఖండం. అ.25.శ్లో.58,59)

🍁గురువుల మాట పథ్యం. అనగా సుఖాన్ని కలిగిస్తుంది అని వేదపండితులు అంటారు. గురువుల మాట సత్యం అని దృఢంగా నమ్మినవారికి, ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సుఖం కల్గుతుంది. అటువంటి వారికి దుఃఖం ఎప్పుడూ, ఎక్కడా ఉండదు. గురువులు చెప్పిన మాట వినక, ఆయన మార్గాన్ని విడిచిన వారికి ఈ లోకంలోనూ సుఖం ఉండదు. ఇక పరలోకసుఖం అసంభవం. గురువు చెప్పినది ఏదైనా సరే చేయవలసిందే. నా జీవితం ఏమైపోయినా సరే. నా గురుని ఆజ్ఞ ఉల్లంఘించను. గురువును నమ్మిన వ్యక్తికి శాశ్వతసుఖం కలిగినా కలగవచ్చు, లేదా శూన్యమే మిగలవచ్చు. ఏది ఏమైనా నాకు గురుభక్తియే ముఖ్యం. గురుభక్తి వల్ల మాత్రమే శాశ్వతముక్తి లభిస్తుంది.గురునింద చేయడం, వినడం మహాపాపాలు.


🍁పద్మపురాణంలోని శ్లోకము
ధర్మం భజస్వ సతతం త్వజ లోక ధర్మాన్
సేవస్వ సాధు పురుషాన్ జహి కామ తృష్ణామ్

🍁ధర్మమును సేవించుము, లోక ధర్మమును విడిచిపెట్టుము, సాధు పురుషులను సేవించుము, కోరిక మీద ఆశను గెలువుము. ధర్మము సామాన్య ధర్మం, విశేష ధర్మం అలాగే లోక ధర్మం, వైదిక ధర్మం అని నాలుగు విధములు. కుల, మత, వర్గ, వర్ణ బేధం లేకుండా స్త్రీ, పురుష బేధం లేకుండా అందరికి ఒకే తీరుగా ఉండేది సామాన్య ధర్మం. సత్యమునే మాట్లాడుట, ఎవరిని హింసించకుండుట, పరోపకారం, ఉన్నంతలో దానం చేయుట, అనాథలు, దీనులకు భిక్షపెట్టుట, బాధను ఇతరులకు తెలియచేయకుండుట ఇవన్నీ సామాన్య ధర్మాలు. శరీరాన్ని, మనసును, బుద్ధిని మంచి మార్గంలో నడిపించే ధర్మాలు ఇవి.

🍁మిత్రుడు, శత్రువు, బంధువు, పాలివారు (జ్ఞాతులు), సేవకులు, యజమానులు, సంపద, ఆపద, సంతోషం, దుఃఖం ఇవన్నీ లోక ధర్మాలు అంటే బ్రతకడానికి పనికి వచ్చేవి. ఇక వైదిక ధర్మాలు తపస్సు, శమము, ద మము( ఇంద్రియ నిగ్రహము), దైవ చింతన ఇవి ఆత్మ తరించడానికి పనికి వచ్చే ధర్మాలు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ధర్మాలు విశేష ధర్మాలు. ఈ ధర్మములన్నీ సకల మానవ జాతి తప్పక ఆచరించదగినవని గోకర్ణుడు చెప్పెను. అలాగే అహింస, సత్యాదులను, ఆత్మ ధర్మములను సేవించుమని కూడా చెప్పెను. లోక ధర్మాలను అంటే కుటుంబ పోషణ, ఆస్తిని సంపాదించుట వంటివి వదిలి పెట్టమని చెప్పాడు. పిల్లలు పెద్దవారై స్థిరపడిన తరువాత కూడా ఇంకా వారిని పోషించాలని, కాపాడాలనే తపనతో శరీరం, మనసు, బుద్ధి బాధల పాలవుతుంది కావున సామాన్య ధర్మాన్ని ఆచరించు, లోక ధర్మాలను విడిచిపెట్టమని ఈ శ్లోకంలోని అర్ధము.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి