28, సెప్టెంబర్ 2020, సోమవారం

విష్ణు కథ

🕉 విష్ణు కథ -  🕉

విష్ణువు జయవిజయులతో, ‘‘మహా మునుల శాపం మీరరానిది. నా పట్ల మిత్రభావంతో ఏడు జన్మల్లో తరించి వస్తారా? లేక నన్ను ద్వేషిస్తూ నాకు శత్రువులై మూడు జన్మల్లో నాచేత అంతమొంది ఇక్కడికి వస్తారా?'' అని అడిగాడు. జయవిజయులు విష్ణు సన్నిధానాన్ని త్వరగా చేరుకోడానికి మూడు జన్మలే కోరుకున్నారు.

అప్పుడు సనకసనందనాది మునులు జయవిజయుల్ని మెచ్చుకుంటూ విష్ణువుతో, ‘‘రాగద్వేషాలు రెండూ నీకు సమానమనీ, నిన్ను ద్వేషించేవారు మరింత త్వరగా నీకు దగ్గరవుతారనీ ఇప్పుడు తెలుసుకున్నాం! కర్తవ్య నిర్వహణలో మమ్మల్ని అడ్డుకున్న నీ ద్వారపాలకులను శపించిన మా తొందరపాటుతనానికి సిగ్గు పడుతున్నాం. మమ్మల్ని మన్నించు!'' అని చెప్పి, లక్ష్మీనారాయణులను అనేక విధాల మనసార స్తుతిస్తూ సేవించి వెళ్ళారు.

జయవిజయులు కశ్యపప్రజాపతి భార్య దితి కడువున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడుగా పుట్టారు. అన్నదమ్ములు గొప్ప పరాక్రమవంతులై తపస్సులు చేసి బ్రహ్మను మెప్పించి గొప్ప వరాలు పొందారు. విష్ణువుపై కత్తికట్టి విజృంభించారు. హిరణ్యకశిపుడు రాక్షసులకు రాజై, విష్ణువును ఎదుర్కొని సాధించడానికి కంకణం కట్టుకున్నాడు. హిరణ్యాక్షుడు విష్ణువును కవ్వించే ఘోరకృత్యాలు చేసి చేసి, భూమిని దొర్లించుకుపోయి రసాతల సముద్రంలోకి తోశాడు. భూమి రసాతలం అడుగున మునిగిపోయింది. భూదేవి విష్ణువును తలంచి తన్ను ఉద్ధరించమని మొరపెట్టింది.

విష్ణువు భూదేవి మొర ఆలకించి దశావతారాల్లో మూడవది అయిన వరాహావతారాన్ని ఎత్తాడు. బ్రహ్మ హోమం చేస్తూండగా యజ్ఞకుండం నుంచి తెల్లని కాంతితో ఒక నలుసు వెలువడింది. ఆ నలుసు క్రమ క్రమంగా పెద్దదై అడవి పందిగా రూపొందింది. ఆ ఏదు పందిని విష్ణువు అవతారంగా ఎంచి బ్రహ్మాది దేవతలు యజ్ఞవరాహంగా, శ్వేత వరాహంగా, ఆదివరాహంగా కీర్తిస్తూ స్తుతించారు.

యజ్ఞవరాహము అలా అలా పెరిగి, బ్రహ్మాండమైన ఆకృతి పొందింది; బలిష్ఠమైన కాళ్ళతో, ఉక్కుకవచం లాంటి పైచర్మంతో, వజ్రాల్లాంటి పొడవైన వాడి కోరకొమ్ములతో, ఎరన్రికాంతి ప్రసరించే కన్నులతో, మెడ నుంచి తోకవరకూ నిక్కబొడుచుకొని బంగారంలా మెరుస్తున్న వెంట్రుకల జూలుతో, విశ్వమంతా ఘూర్ణిల్లేలాగ వరాహము హుంకార ధ్వనులు చేసింది. యజ్ఞవరాహం ముట్టెలపై ఖడ్గంలాంటి కొమ్ము ధగధగా మెరుస్తున్నది.

వరాహావతారం మెరుపు వేగంతో రసాతలానికి పరిగెత్తింది. ఆ వేగానికి దిక్కులు అదిరాయి, ప్రళయవాయువులు భీకరంగా వీచాయి. రసాతల సముద్రంలోకి చొచ్చుకొని వెళ్ళి, అడుగున మునిగి ఉన్న భూమిని తన కొమ్ముతో గుచ్చి యజ్ఞవరాహము మీదకు ఎత్తింది. అదే సమయంలో హిరణ్యాక్షుడు వరుణుడిపై దాడిచేసి పోరాటానికి పిలిచాడు.
వరుణుడు, ‘‘వీరాధి వీరుడివైన నీవు పోరాడవలసినది నాతో కాదు రసాతలం నుంచి భూమిని ఉద్ధరిస్తున్న యజ్ఞవరాహంతో!’’ అని అన్నాడు.

హిరణ్యాక్షుడు హుటాహుటిని వెళ్ళి యజ్ఞ వరహావతారాన్ని ఢీకొన్నాడు. వరాహరూప విష్ణువుతో హిరణ్యాక్షుడు గొప్ప పరాక్రమంతో పోరుతూ గదతో విష్ణువు గదను తృళ్ళగొట్టి కొంతసేపు అలాగే నిల్చున్నాడు. విష్ణువు అతని యుద్ధనీతిని మెచ్చుకొని తిరిగి గదను ధరించాక, ఇరువురికీ సంగ్రామం ఘోరంగా సాగింది. చివరకు వరాహావతారం తన కొమ్ముతో హిరణ్యాక్షుణ్ణి పొడిచి చంపింది.

వరాహావతారుడైన విష్ణువును భూదేవి వరించింది. వరాహమూర్తి భూదేవిని సందిట చేర్చుకొని తొడపై కూర్చుండ బెట్టుకున్నాడు. బ్రహ్మాది దేవతలు పూలవాన కురిపిస్తూ, జగపతిగా విష్ణువును అనేక విధాలుగా స్తోత్రం చేశారు.

పందిరూపంతో తన తమ్ముణ్ణి చంపిన విష్ణువుపై పగ సాధించడానికి తీవ్ర సంకల్పంతో, ముందు బ్రహ్మవల్ల వరాలు పొందడానికి హిరణ్యకశిపుడు తపస్సుకు బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు అతని భార్య లీలావతి గర్భవతిగా ఉన్నది. ఆమె గర్భవాసాన్ని హతమార్చడానికి ఇంద్రుడు మాయోపాయంతో లీలావతిని చెరగొని, ఆకాశమార్గాన పోతూండగా, నారదుడు ఎదురై, ‘‘దేవేంద్రా! ఎంత పనికి ఒడిగట్టావు! నీ ప్రయత్నాన్ని విరమించు. సర్వకాల సర్వావస్థలలో హిరణ్యకశిపుడు పగతో విష్ణువు గురించే తలంచుతూండే వాడవడంవల్ల, లీలావతి గర్భస్థుడైన శిశువుకు ఆ విష్ణుచింతన సంక్రమించి, పగ భక్తిగా అతనిలో రూపాంతరం పొందింది. ఇదే విష్ణుమాయ అయిన ప్రకృతి విశేషాల్లో ఒకటి.

లీలావతి గొప్ప విష్ణుభక్తుణ్ణి కనబోతూన్నది. అంచేత లీలావతిని విడిచిపుచ్చి. నీ దారిన నువ్వు వెళ్ళు!’’ అని చెప్పి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు.

ఆశ్రమంలో నారదుడు ఉన్నతమైన వేదాంత విషయాలనూ, విష్ణు దివ్య కల్యాణ గుణగణాలను వర్ణిస్తూన్నప్పుడు, లీలావతి గర్భంలో ఉన్న బిడ్డ అమిత ఆసక్తితో వింటూ, ఊకొడుతూండే వాడు. లీలావతి కుమారుణ్ణి ప్రసవించింది. హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు.

భూమ్మీద గాని, ఆకాశంలోగాని, రాత్రిగాని పగలు గాని, ఇంటగాని, బయటగాని, మృగంచేత గాని మనిషిచేతగాని, దేవతలు మొదలైన వారివలన గాని, ప్రాణమున్న దానిచేత గాని లేనిదానిచేతగాని, నిప్పు, నీరులాంటి పంచభూతాల చేతగాని సృష్టిలో ఉన్న ఏరూపంచేత గాని, ఇంకా ఎన్నో విధాలుగా తనకు చావులేని వరాల్ని కోరాడు; బ్రహ్మ అతను కోరిన వరాలన్నిటినీ ఇచ్చాడు.

వరాలను పొందిన విజయగర్వంతోహిరణ్యకశిపుడు వస్తూండగా, నారదుడి వలన జరిగినది విని, నారదాశ్రమానికి వచ్చి, కుమారుడి పేరు ప్రహ్లాదుడు అని నామకరణ మహోత్సవం జరిగాక, భార్యనూ, కుమారుణ్ణీ తన రాజధానికి తీసుకువెళ్ళాడు. ఇంద్రుడిపై ప్రతీకారంగా హిరణ్యకశిపుడు స్వర్గం మీదకు దండయాత్ర చేసి, స్వర్గ సింహాసనం ఆక్రమించాడు.

దిక్కులన్నిటినీ జయించి, అష్ట దిక్పాలకుల్ని తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నాడు. దేవతల్ని పశువుల్ని బాదినట్లుగా బాదాడు. శచీదేవిని అవమానించబోతే లీలావతి అడ్డుకొంది.

హిరణ్యకశిపుడు విజృంభించి మునుల ఆశ్రమాల్ని తగలబెట్టించాడు. విష్ణు విశ్వాసకుల్ని చిత్రవధలు చేయించాడు. విష్ణువును ఎదుర్కోవడమే అతని ధ్యేయం. విష్ణువును కవ్వించడానికి చేయవలసినవన్నీ చేశాడు. అయినా విష్ణువు అతనికి తారసపడలేదు. వైకుంఠానికి దాడి వెళ్ళాడు. అక్కడా విష్ణువు అతనికి కనపడలేదు. ‘‘నాకు భయపడి అదృశ్యంగా దాగున్నాడు. పిరికిపంద!’’ అని హిరణ్యకశిపుడు తిరిగివచ్చాడు.

ప్రహ్లాదుడు దినదిన ప్రవర్థమానంగా ఎల్లప్పుడు విష్ణుస్మరణ చేస్తూ పెరుగుతూన్నాడు. తనకు అటువంటి కులద్రోహి ఎందుకు పుట్టాలి! అని హిరణ్యకశిపుడు చింతించి, గురుపుత్రులైన చండామార్కులకు ప్రహ్లాదుణ్ణి అప్పగించి, విద్యాబుద్ధులు నేర్పమన్నాడు. ప్రహ్లాదుడు గురుకులంలో హరిధ్యానంతోనే చదువంతా పూర్తిచేశాడు. తోటి బాలురకు విష్ణుభక్తి ప్రబోధంచేసి మోక్ష మార్గంపట్ల ఆసక్తికలవారిగా చేశాడు.

చండామార్కులు ప్రహ్లాదుణ్ణి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళారు. హిరణ్యకశిపుడు కుమారుణ్ణి ఆప్యాయంగా తొడపై కూర్చుండబెట్టుకొని, ‘‘నాయనా! నువ్వు నేర్చిన విద్యతెలిసేలాగ మంచి పద్యం ఒకటి చెప్పు!’’ అన్నాడు. ప్రహ్లాదుడు, ‘‘తండ్రీ! గురువులు చెప్పిన చదువంతా క్షుణ్ణంగా నేర్చాను. చదువులన్నిటి కంటె గొప్పదైన చదువు విష్ణువునందు మనసు నిల్పడం ఒక్కటే! విష్ణువును స్మరించే జన్మే జన్మ!’’ అన్నాడు. హిరణ్యకశిపుడు కుమారుణ్ణి చప్పున క్రిందకు తోసి పట్టరాని ఆగ్రహంతో చండామార్కులతో, ‘‘ఇదా మీరు నేర్పిన చదువు?’’ అన్నాడు.

చండామార్కులిద్దరూ గజగజలాడుతూ, ‘‘మా తప్పేమీ లేదు, మహాప్రభూ! మాపై ఆగ్రహించకు!’’ అని వేడుకుంటూ, గురుకులంలో ప్రహ్లాదుడేవిధంగా ప్రవర్తించినదీ వివరంగా విన్నవించుకున్నారు. హిరణ్యకశిపుడు కొడుకుతో, ‘‘విష్ణువు పందిగా నీ పినతండ్రిని చంపాడు. మన రాక్షస కులానికి పరమశత్రువు. నీవు విష్ణువును పొగడ్డం క్షమించరాని కులద్రోహం. విష్ణుభక్తి మాను, ఈ క్షణమే వాణ్ణి మర్చిపో!’’ అన్నాడు.

‘‘దానవేశ్వరుడవైన నీవు అన్నివిధాలా నన్ను శాసింపతగినవాడివే! కాని ఇనుముముక్క అయస్కాంతాన్ని ఏవిధంగా అంటుకుంటుందో, అలాగే నా మనస్సు విష్ణువుపైనే లగ్నమై ఉన్నది; మందార పువ్వు మకరందాన్ని తుమ్మెద ఎలాగ విడిచి పెట్టలేదో, అలాగే విష్ణువును మర్చిపోవడం నా వశంలో లేదు. నాలో జీవము ఉన్నంతవరకూ విష్ణుచింతన పోదు, ఆ జీవము కూడా విష్ణువే!’’ అన్నాడు వినయంగా.

ముక్కుపచ్చలారని బాలుడైన ప్రహ్లాదుడి మాటలకు విస్తుపోతూ హిరణ్యకశిపుడు కోపంతో అగ్నిలా ప్రజ్వరిల్లి, ‘‘అయితే నీవు చావక తప్పదు, ఆహార పానాలు లేకుండా మలమల మాడి చావు!’’ అంటూ ప్రహ్లాదుణ్ణి వెలుతురు చొరని కారాగారంలో పెట్టించాడు. పుత్రప్రేమతో లీలావతి తల్లడిల్లి పోయింది.

రోజులు గడుస్తున్నాయి. లీలావతి శోకం చూడలేక హిరణ్యకశిపుడు కారాగారం తెరిపించి, తన్మయుడై విష్ణుసంకీర్తన చేస్తూ నవనవలాడుతూన్న ప్రహ్లాదుణ్ణి చూసి, చాలా రోజులుగా అన్న పానాలు లేకుండా ఎలా బతికి ఉన్నాడా అని ఆశ్చర్యపడుతూనే, పట్టరాని ఆగ్రహంతో ప్రహ్లాదుణ్ణి ఏనుగులచేత మట్టించమన్నాడు. ప్రహ్లాదుణ్ణి చూడగానే ఏనుగులు సింహాన్ని చూసినట్లు బెదిరాయి. మావటివాళ్లు పొడిచి అతి ప్రయత్నం మీద నడిపించితే, అతనిమీద నుంచి వెళ్ళాయిగాని, అతనికే అపాయమూ కలగలేదు.

పాములచేత కరిపించబోతే, కాటువేయకుండా ముద్దాడి, పడగలు విప్పి గొడుగులుపట్టి ఆడాయి. కొండశిఖరం నుంచి తోయించాడు, మంటల్లో వేయించాడు, సముద్రంలో పడవేయించాడు, కాలకూట విషం త్రాగించాడు. ఎన్నిచేసినా, ప్రహ్లాదుడు సురక్షతంగా ఉండటం చూసి, హిరణ్యకశిపుడు, ‘‘నువ్వు, చావకున్నా వెందుచేత? ఆ రహస్యమేమిటో చెప్పు!’’ అని అడిగాడు.

ప్రహ్లాదుడు నవ్వుతూ, ‘‘ఇందులో రహస్యం ఏదీలేదు; ఏనుగుల్లో, పాముల్లో, రాళ్ళలో, అగ్నిలో, సముద్రాల్లో, విషంలో అన్నిట్లో, నీలో, నాలో ఉన్నది విష్ణువే అన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు! నన్ను చంపాలనుకుంటున్నదీ, నేను బతుకుతూన్నదీ, అతని లీలావినోదమే, నాన్నా!’’ అన్నాడు.

ఆ మాటలకు హిరణ్యకశిపుడు కోపావేశంతో ప్రహ్లాదుణ్ణి బరబరా ఈడ్చుకు వెళ్ళి సభామంటపం మధ్య నిలబెట్టి, తన గదను తీసి పట్టుకొన్నాడు. లీలావతి మూర్ఛపోయింది. చుట్టూరా రాక్షస ప్రముఖులు నిర్విణ్ణులై బొమ్మల్లా నిలబడి చూస్తున్నారు.

సభామంటపానికి ఎదురుగా లోహనిర్మితమైన పెద్ద జయస్తంభం ఉంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి ఆ స్తంభాన్ని చూపుతూ, ‘‘ఓరీ కులద్రోహీ! అది, నా విజయ స్తంభం! నా తమ్ముణ్ణి చంపిన విష్ణువుతో పోరాడి, నీ ముందే సంహరించి పగతీర్చుకుంటాను, అందులో ఉన్నాడా?’’ అని అడిగాడు. ‘‘ఆసందేహమే వద్దు నాన్నా. అంతటా ఉన్నాడు, అందులోనూ ఉన్నాడు,’’ అన్నాడు ప్రహ్లాదుడు.

హిరణ్యకశిపుడు చరచరా వెళ్ళి గదతో స్తంభాన్ని కొట్టాడు. ప్రళయధ్వనితో భూన భోంతరాలు దద్దరిల్లాయి, పొగల మేఘాలు అంతటా విరజిమ్ముకున్నాయి. స్తంభం రెండుగా చీలిపోతూండగా వెలువడిన మిరుమిట్లుగొలిపే మెరుపుల మధ్య దశావతారాల్లో నాలుగవది అయిన నరసింహావతారంగా విష్ణువు ఆవిర్భవించాడు. సింహం తల, మనిషి శరీరము, చేతులకు సింహం గోళ్ళతో సృష్టిలో లేని అద్భుత రూపం గల నరసింహమూర్తి ప్రళయభీకరంగా గర్జించాడు. పాంచజన్యశంఖధ్వని వినిపించింది. సుదర్శనచక్రం అతని చుట్టూ తిరుగుతూ కనిపించింది

సశేషం..
🕉️🙏🕉️🙏🕉️🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి