29, డిసెంబర్ 2022, గురువారం

కలశం పైన కొబ్బరికాయ ఏమి చేయాలి?

*కలశం పైన కొబ్బరికాయ ఏంచేయాలి ?*

సాధారణంగా కలశాన్ని నోములు, వ్రతాలు చేసుకొనే సమయంలో పెడుతూ ఉంటాం. ఆ కలశాన్ని షోడశోపచార పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాం . ఆ తర్వాత ఆ కలశంలోకి ఆవాహన చేసిన దైవానికి ఉద్వాసన చెప్పాక , కలశం పైనున్న కొబ్బరికాయని ఏంచేయాలనేది సందేహం.

*దైవంగా భావించి పూజించిన కాయని కొట్టుకుని తినొచ్చా ? పచ్చడి లాంటి పదార్థాలు చేసుకోవచ్చా ?*
అని సందేహాలుంటాయి .
*వాటికి సమాధానాన్ని వెతుక్కునే చిరుప్రయత్నమే ఇది* 

కలశంలోని కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి ప్రతీక. *కాయ పైనుండే పొర - చర్మం. పీచు - మాంసం. దృఢంగా ఉండే చిప్ప- ఎముకలు. అందులో ఉండే కొబ్బరి -మనిషిలోని ధాతువు. కాయలోని నీళ్లు - ప్రాణాధారం. పైన ఉండే మూడు కన్నులే - ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. జుట్టు- అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక. స్వయంగా ఆ పరమేశ్వరుడే తనకి ప్రతి రూపంగా కొబ్బరికాయని సృష్టించారు . ఇటువంటి ప్రత్యేకలని కలిగిఉండడం వల్లనే కొబ్బరికాయ పరమాత్మ స్వరూపమై పూజలందుకోవడానికి అర్హతని సంపాదించుకోగలిగింది*.

కలశాన్ని స్థాపించేప్పుడు , వారి తాహతును బట్టి రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, ఆ కలశంలో కొంచెం నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వస్త్రం చుట్టిన కొబ్బరికాయను పెట్టి పూజ చేస్తారు. అప్పుడు దీనిని *“పూర్ణకుంభము”* అని పిలుస్తారు . అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది. ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది. ఇలా కలశాన్ని స్థాపన చేసే నేపధ్యానికి సంబంధించి ఒక గాథని మన పురాణాలు చెబుతాయి . 

*సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రములో తన శేషశయ్య పై పవ్వళించి ఉన్నాడు. అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అప్పుడు ఆయన తొలుత కలశస్థాపన చేశారు.* ఆవిధంగా కలశంలొని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రథమ జాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది అన్నింటికీ జీవన దాత. లెక్కలేనన్ని *నామరూపాలకి, జడ పదార్థాలకి ,చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త.* 

ఇక కలశంలో ఉంచిన *ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక.* చుట్టబడిన *దారము సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ'ను సూచిస్తుంది*. అందువల్లనే 'కలశం' శుభసూచకంగా పరిగణింపబడి పూజింపబడుతున్నది.

అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తరువాత అందులోని నీరు *"అభిషేకము''* తో సహా అన్ని వైదికక్రియలకి వినియోగింప బడుతుంది. దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశజలముల అభిషేకాలతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు. *పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.* 

ఇంట్లో ఇటువంటి *కలశానికి వినియోగించిన కొబ్బరికాయని పూజ చేయించటానికి వచ్చిన బ్రాహ్మణులకు ఇవ్వచ్చు.* దీన్ని *పూర్ణఫల దానం* అని కూడా అంటారు. ఒకవేళ అలా అవకాశం లేకపోతె, పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చు. *కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇచ్చిన లేదా పారే నీటిలో నిమజ్జనం చేసిన ఎటువంటి దోషాలు ఉండవు.* 

*దేవాలయంలో కలశాన్ని పెడితే పూర్ణాహుతి చేస్తారు.*

అదన్నమాట ఈ సంప్రదాయంలోని విశేషం. అంతేకానీ, కొబ్బరి పచ్చడి చేసుకుంటే బాగుంటుందని కొట్టుకుని పచ్చడి చేయకండి . ఇక సందేహాలు పక్కనపెట్టి చక్కగా ఆ విధంగా చేసి, మీ పూజలు, వ్రతాల సంపూర్ణ ఫలాన్ని ఆనందంగా పొందండి . శుభం . 

*లోక సమస్తా సుజనో భవతు*
*సర్వే సుజనా సుఖినో భవతు*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి