28, ఫిబ్రవరి 2022, సోమవారం

Vitamins Deficiency

Vitamins Deficiency: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషక పదార్ధాలు, విటమిన్స్ చాలా అవసరం. కొన్ని రకాల విటమిన్ల లోపిస్తే ఆ సంకేతాలు స్పష్టంగా కన్పిస్తాయి. శరీరంలో ఏ విటమిన్ లోపముందో ఎలా తెలుసుకోవాలో పరిశీలిద్దాం..

శరీరం వివిధ రకాల వ్యాధులతో పోరాడాలంటే వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం. మరి వ్యాధి నిరోధకశక్తి పెంపొందించాలంటే కచ్చితంగా పోషక పదార్ధాలు, విటమిన్స్, ఖనిజాలు అత్యవసరం. శరీరంలో ఇవి లోపిస్తే వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. ఏయే విటమిన్ల లోపంతో ఏ సమస్యలు తలెత్తుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

ముఖ్యంగా విటమిన్ ఎ లోపముంటే కంటి సమస్య ఎదురౌతుంది. మెరుగైన కంటి దృష్టి కోసం విటమిన్ ఎ తప్పనిసరి. చీకట్లో సైతం చూసేందుకు దోహదపడే రోడాపిన్స్ ఉత్పత్తికి విటమిన్ ఎ దోహదపడుతుంది. విటమిన్ ఎ లోపముంటే..తక్కువ వెలుతులో సరిగ్గా చూడలేకోవపోవడం, చర్మం చికాకు, దురద, కళ్లు పొడిబారడం వంటివి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

ఇక విటమిన్ బి 2, బి 6 లు శరీర కణజాలాల నిర్వహణకు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోడానికి చాలా అవసరం. విటమిన్ బి6 నీటిలో కరిగే గుణం కలిగినది. శరీరంలో ఎంజైమ్‌ల నిర్మాణానికి దోహదపడుతుంది. ఈ విటమిన్ లోపముంటే..నోటి అల్సర్, నోటి పూత, చుండ్రు, తలపై ప్యాచెస్, స్కాల్ప్ దురదగా ఉండటం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

విటమిన్ బి 7 అనేది మనం తినే ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఎప్పటికప్పుడు రిఫ్రెష్, ఎనర్జిటిక్ ఫీలింగ్ కల్గిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే..గోర్లు సులభంగా విరిగిపోవడం, తీవ్రమైన అలసట, కండరాల్లో నొప్పి, తిమ్మిరి, చేతులు, కాళ్లలో జలదరింపు ప్రధాన లక్షణాలుగా కన్పిస్తాయి.

ఇక విటమిన్ బి 12 అనేది మెదడు, నరాలు, రక్తకణాల పనితీరును మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో ఇవే కీలకం. ఎక్కువగా పౌల్ట్రీ, పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే..తరచూ తలనొప్పి, చర్మం లేతగా ఉండటం లేదా పసుపుగా ఉండటం, నోటిలో పగుళ్లు, వాపు, డిప్రెషన్ వంటి లక్షణాలు కన్పిస్తాయి.

విటమిన్ సి కారణంగా కణజాలాలు మెరుగ్గా ఉంటాయి. శరీరంలో జరిగే వైద్య ప్రక్రియకు దోహదపడుతుంది. గాయాలు త్వరగా మానేందుకు ఉపయోగకరం. ఇమ్యూనిటీ పెంచేందుకు ఈ విటమిన్ కీలకం. విటమిన్ సి లోపిస్తే..గాయాలు త్వరగా మానకపోవడం, డ్రై స్కాల్ప్, చర్మం పొడిగా ఉండి దురద ఉండటం, ముక్కు నుంచి రక్తం కారుతుండటం, మడమల్లో పగళ్లు రావడం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

ఇక మరో ముఖ్యమైంది విటమిన్ ఇ. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పెంచేందుకు దోహదపడుతుంది. ధమనులు గడ్డకట్టకుండా ఆపుతుంది. రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విటమిన్ లోపిస్తే..చేతులు, కాళ్లలో చలనం లేకపోవడం, శరీర కదలిక అనియంత్రితంగా ఉండటం, బలహీనమైన కండరాలు ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి